తెలంగాణ కరువు పరిస్థితులు, NewzFast Telugu (తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడి, వ్యవసాయం మరియు జీవనోపాధిపై పడుతున్న ప్రభావంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
డాక్టర్ చెరుకు సుధాకర్, కబ్బక శ్రావణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, సరైన వర్షాలు కురవకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 3.5 కోట్ల మంది ప్రజలు ఈ పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని పిటిషనర్లు తెలిపారు.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలో తాగునీటి అవసరం సుమారు 409 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంఘం గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు సాధారణ వర్షపాతం 833.1 మి.మీ కాగా, కేవలం 630.1 మి.మీ మాత్రమే నమోదైంది.
ఇది సుమారు 24 శాతం లోటును సూచిస్తోంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, నిరుపేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో తాగునీటి సమస్య కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలను కూడా ప్రస్తావించారు.
విద్యాసంస్థలు, హాస్టళ్లు, నివాస ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను వెంటనే మెరుగుపరచాలని పిటిషనర్లు కోరారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తక్షణమే స్పందించి సమగ్ర చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
ప్రతి జిల్లాకు ప్రత్యేక లేదా నోడల్ అధికారులను నియమించి కరువు సహాయక చర్యలను పర్యవేక్షించాలని, సురక్షిత తాగునీరు, ఆహార ధాన్యాలు, నిత్యావసరాలను అందించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.




