టీజీజెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రికార్డు, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీజెన్కో) రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం (నవంబర్ 11న) తొలిసారిగా 6,088 మెగావాట్ల ఆల్‌టైమ్ గరిష్ఠ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసి కీలక మైలురాయిని అధిగమించింది.
సింగరేణి కాలరీస్ (ఎస్సీసీఎల్), రైల్వేశాఖతో మెరుగైన సమన్వయం, బొగ్గు రవాణా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా థర్మల్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా అయ్యేలా అధికారులు తీసుకున్న చర్యలు ఈ రికార్డు స్థాయి ఉత్పత్తికి దోహదపడ్డాయి.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీజెన్కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, బీహెచ్ఈఎల్ డైరెక్టర్ (పవర్) తజీందర్ గుప్తా గురువారం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను సందర్శించారు.
మూడు నాలుగు నెలల క్రితం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లో సాంకేతిక అవరోధాలు, జిగట బొగ్గు (స్టిక్కీ కోల్), స్లర్రీ బొగ్గు సరఫరా కారణంగా 3,200 మెగావాట్ల సామర్థ్యానికి గాను ఇక్కడ ఉత్పత్తి 1,700 మెగావాట్లకు పడిపోయింది.
దీనిపై ఉన్నతాధికారులు ప్రాజెక్టు వద్దే బస చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వైబ్రేటింగ్ గ్రిజ్లీ ఫీడర్లలో (వీజీఎఫ్) మార్పులు, బెల్టుల సర్దుబాటు, పుల్లీల మార్పు, స్కర్ట్ ప్యాడ్ల సర్దుబాటు వంటి పనులు పూర్తి చేయడంతో ప్రస్తుతం సగటున 2,000 నుంచి 2,100 మెగావాట్లు, గరిష్ఠంగా 2,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
800 మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి 5వ యూనిట్‌ను వచ్చే నెల నాటికి కమిషన్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కమిషనింగ్ తర్వాత స్టేషన్ వ్యవస్థల స్థిరీకరణకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత యాదాద్రి ప్లాంట్ తన పూర్తి స్థాపిత సామర్థ్యమైన 4,000 మెగావాట్ల స్థాయికి చేరుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.




