సీఎంఆర్ఎఫ్ చెక్కు, NewzFast Telugu (మేడిపల్లి): ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ సహాయం ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన తిరుమల్‌రావుకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తుంగతుర్తి రవి ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, ప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని చెప్పారు.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత త్వరగా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం పొందిన తిరుమల్‌రావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరిగే సతీష్, కొమ్ము బంగారయ్య, అక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




