బంగారం ధరలు, NewzFast Telugu (ఢిల్లీ, హైదరాబాద్): దేశంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల సంకేతాల కారణంగా పసిడి ధరలు వరుసగా మూడో రోజూ పతనమై వారం కనిష్ట స్థాయికి చేరుకోగా, దాని ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ గురువారం సుమారు రూ. 2,200 వరకు క్షీణించాయి.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1 శాతం తగ్గి ఔన్సుకు 3,948.82 డాలర్లకు పడిపోగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం క్షీణించి 3,954.50 డాలర్లకు చేరాయి. ప్రధానంగా అమెరికాలో అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడంతో, దీన్ని కట్టడి చేయడానికి అమెరికా కేంద్ర బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ డిసెంబర్లో వడ్డీ రేట్లను మరింత పెంచుతుందనే అంచనాలు బలపడ్డాయి.
ఇదే సమయంలో అమెరికన్ డాలర్ విలువ 19 నెలల గరిష్ట స్థాయికి దూసుకెళ్లడం బంగారం ధరల పతనానికి ప్రధాన కారణమైంది. గురువారం సాయంత్రానికి దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 1,42,350కు చేరింది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 2,180 తగ్గి రూ. 1,39,800గా ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 2,000 తగ్గి రూ. 1,28,150గా ఉంది. వెండి ధరలు స్వల్పంగా క్షీణించి కిలో రూ. 2 లక్షలకు చేరాయి.




