సైబర్ భద్రత, NewzFast Telugu (హైదరాబాద్): దేశవ్యాప్తంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) మరియు ఫిన్‌టెక్ కంపెనీల చెల్లింపుల వ్యవస్థలపై ఇటీవల ఏఐ ఆధారిత సైబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అప్రమత్తమైంది.
గురువారం హైదరాబాద్‌లోని TGCSB కార్యాలయంలో ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ సంస్థలు, బ్యాంకు ప్రతినిధులతో పాటు టెలికమ్యూనికేషన్స్ విభాగం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, మోసం జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడానికే ఆర్థిక సంస్థల బాధ్యత పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.
మోసపూరిత లావాదేవీలను మూలంలోనే నిరోధించడం, అనుమానాస్పద కార్యకలాపాలను రియల్ టైమ్‌లో గుర్తించడం, మ్యూల్ ఖాతాల ద్వారా నిధుల తరలింపును అడ్డుకోవడమే ప్రధాన కర్తవ్యం కావాలని ఆమె తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు మరియు ఫిన్‌టెక్ సంస్థలు క్రమం తప్పకుండా వీఏపీటీ (VAPT) నిర్వహించాలని, చెల్లింపు మరియు రుణ పంపిణీ ఏపీఐలను సురక్షితం చేయాలని సూచించారు.
సైబర్ దాడిని గుర్తించిన వెంటనే ఆటోమేటెడ్ రుణ పంపిణీ సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసి మాన్యువల్ విధానానికి మారాలని, ఖాతాలను ఫ్రీజ్ చేసి క్యూలో ఉన్న ఏపీఐ కాల్స్‌ను క్లియర్ చేయాలని బ్యాంకులను కోరారు. కీలక పేమెంట్ ఏపీఐలను తక్షణమే సమీక్షించడంతో పాటు ప్రతి ఖాతాకు రోజువారీ లావాదేవీల సంఖ్యపై పరిమితి విధించాలని, TGCSBతో సమన్వయానికి 24×7 నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.
సైబర్ ఘటనలను వీలైనంత త్వరగా RBI DAKSH పోర్టల్ ద్వారా ఆర్‌బీఐకి నివేదించాలని డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రతినిధి రుషి మెహతా వర్చువల్‌గా పాల్గొని, పేఅవుట్ వ్యవస్థలు మరియు ఏపీఐ దుర్వినియోగంపై అధికారులకు వివరించారు.
సైబర్ భద్రత బలహీనంగా ఉండే చిన్న ఎన్‌బీఎఫ్‌సీలను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. 10 నుంచి 12 రోజుల పాటు సంస్థల అంతర్గత వ్యవస్థలను అధ్యయనం చేసి, వైట్‌లిస్ట్ చేసిన ఐడీలు, పేమెంట్ ఏపీఐ క్రెడెన్షియల్స్, కోడ్‌లోని లోపాలను గుర్తిస్తున్నారని వివరించారు.
అనంతరం ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌ల ద్వారా సాధారణ సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో ఒకే లావాదేవీని చిన్న మొత్తాలుగా విభజించి, బల్క్ లావాదేవీల ద్వారా నిధులను మ్యూల్ ఖాతాలకు మళ్లిస్తున్నారని అధికారులు వివరించారు.




