పెట్టుబడిదారుల పరిరక్షణ చట్టం, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు, తమ కంపెనీల ప్రధాన కార్యాలయాలను కూడా ఏపీకి మార్చాలని పారిశ్రామిక దిగ్గజాలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఫ్యాక్టరీలను నిర్మించడమే కాకుండా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని పరిశ్రమలను లోకేష్ కోరారు. ఏపీలో అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన కనెక్టివిటీ, అపారమైన మానవ వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తుచేశారు.
ఏపీ అనుసరిస్తున్న ‘3S’ మంత్రం (స్పీడ్ – వేగం, స్టెబిలిటీ – స్థిరత్వం, సర్వీసెస్ – సేవలు) దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం పరిశ్రమలతో చేయి కలిపితే, అది తమ సొంత ప్రాజెక్టులా భావించి త్వరగా ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు.
2024 జూన్ నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ. 22.6 లక్ష కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని లోకేష్ వివరించారు. ఇందులో 73 శాతం (రూ. 17.2 లక్షల కోట్లు) ఆమోదం పొందిన ప్రాజెక్టులుగా రూపాంతరం చెందాయని, దీని ద్వారా 12.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.




