నాగోల్ తల్లీకూతురు అదృశ్యం, NewzFast Telugu (హైదరాబాద్, నాగోల్): హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీకూతురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పని చేస్తున్న ఇళ్లలో జీతం తీసుకొస్తానని కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
నాగోల్లోని జైపురి కాలనీ, రోడ్ నంబర్ 1లో శ్రీవెంకటేశ్వర వైన్స్ ఎదురుగా సంపంగి సురేష్ తన భార్య సంపంగి సుగుణ (35), కుమార్తె సంపంగి నందిని (7)తో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం సుమారు 8:30 గంటలకు సుగుణ తన కుమార్తె నందినితో కలిసి తాను పనిచేస్తున్న ఇళ్లలో జీతం తీసుకొస్తానని భర్తకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.
అయితే, ఎంతసేపటికీ తల్లీకూతుళ్లు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.
దీంతో భర్త సంపంగి సురేష్ నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన తల్లీకూతుళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వివరాలను నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ వెల్లడించారు.




