ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, NewzFast Telugu (ఖమ్మం): పటిష్టమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల సమర్పణతో నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. తద్వారా బాధితులకు సత్వర, సముచిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో కేసుల ట్రయల్ ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. విచారణ సమయంలో తలెత్తే లోపాలు, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు.
కేసులకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాధారాలను ఈ-సాక్ష్య యాప్‌లో నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నిర్ణీత గడువులో నాణ్యమైన ఛార్జ్షీట్లను న్యాయస్థానాల్లో దాఖలు చేయాలని తెలిపారు.
రోడ్డు ప్రమాద బాధితులకు అందుబాటులో ఉన్న పీఎం రహత్ పథకం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందుతుందని ఆయన వివరించారు.
ప్రమాద సమయంలో ప్రాణాలు రక్షించడంతో పాటు బాధిత కుటుంబాలపై చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించడమే దీని లక్ష్యమని చెప్పారు.
గంజాయి వినియోగదారులను పట్టుకున్నప్పుడు వారికి సరఫరా చేసిన వ్యక్తుల వివరాలను లోతుగా విచారించాలని కమిషనర్ ఆదేశించారు. సరఫరా నెట్వర్క్, ప్రధాన వ్యక్తులు, అసలు మూలాలను గుర్తించి, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని సూచించారు.
నిందితులందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి జరిగే అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పదేపదే నేరాలకు పాల్పడే నేరస్థుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
సెకండ్‌హ్యాండ్ వాహనాల విక్రయదారుల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, యాజమాన్య బదిలీ పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. సరైన పత్రాలు లేని వాహనాల విక్రయాలను అడ్డుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో అమలు తీరును సమీక్షించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, సాంబరాజు, నరసింహరావు, సర్వర్, సత్యనారాయణ, సీఐలు పాల్గొన్నారు.




