హరీష్ రావు, NewzFast Telugu (సిద్దిపేట): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మోసపూరిత పాలన చూసిన తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ గెలవాలని, తెలంగాణ వెలగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట రూరల్ మండలంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గ్రామ కమిటీ కార్యవర్గాలను హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు.
రైతు బంధు, రూ.2 లక్షల రుణమాఫీ, విద్యార్థి భరోసా కార్డ్, నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబర్స్మెంట్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటివరకు 16,500 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధికి అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దినట్లు హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లను నిర్మించి సిద్దిపేట జిల్లాను రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చామని చెప్పారు.
గోదావరి జలాలు వచ్చాక జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని ఆయన అన్నారు.
లక్ష కోట్లు కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు పోయిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేటకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు రద్దు చేయడం తప్ప మరేమీ జరగలేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎండగట్టాలని బీఆర్ఎస్వీ నాయకులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.




