కియా కార్పొరేషన్, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కియా కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఎంఓయూ జరిగింది.
పెనుకొండలో మరో ప్లాంట్ ఏర్పాటుకు రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కియా సంస్థ అంగీకరించింది. దీని ద్వారా కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం పెనుకొండ ప్లాంట్ నుంచి ఏడాదికి 4.3 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. అదనంగా ఏడాదికి మరో 2 లక్షల కార్ల ఉత్పత్తికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.
సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ఒప్పందం జరిగింది. దీంతో మొత్తం సామర్థ్యం ఏడాదికి 6.3 లక్షల కార్లకు చేరుకుంటుంది.
ఏపీ యూనిట్‌లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కియా కార్పొరేషన్ తెలిపింది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కియా సంస్థను రాష్ట్రానికి తీసుకురావడానికి విస్తృత ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు.
గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సౌకర్యం, జాతీయ రహదారి, బెంగళూరు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కల్పించినట్లు తెలిపారు.
గతంలో ప్లాంట్ 14 నెలల్లోనే నిర్మించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో తయారైన తొలి కియా కారును తానే ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
మళ్లీ రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన చెప్పారు. పెట్టుబడుల రక్షణకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్టును తీసుకువస్తున్నట్లు తెలిపారు.
రెండో ప్లాంట్‌ను 2029 మే నాటికే పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. సామాజిక బాధ్యతగా పీ4 కార్యక్రమానికి సహకరించాలని కూడా కోరినట్లు తెలిపారు.




