గోదావరి పుష్కరాలు, NewzFast Telugu (కొత్తగూడెం): గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు.
2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల అభివృద్ధి, రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి, పారిశుధ్యం వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. భద్రాచలం వంతెన నుంచి ఆలయం వరకు రూ.14 కోట్లు, బండ్ నుంచి ఆలయం వైపు రూ.2.60 కోట్లతో చేపట్టాల్సిన రహదారి పనులపై చర్చించారు.
దుమ్ముగూడెం ఘాట్ మరమ్మతులు, మోతే వద్ద వీఐపీ ఘాట్ ఏర్పాటుపైనా ప్రతిపాదనలు పరిశీలించాలని ఆదేశించారు. సారపాక పుష్కరవనం పరిధిలోని 75 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు అనువుగా పరిశీలించాలని, అవసరమైతే మరో 30 ఎకరాల భూమిని గుర్తించి, 10 ఎకరాలను ప్రత్యామ్నాయంగా సిద్ధం చేయాలని తెలిపారు.
ప్రైవేటు భూములు వినియోగించాల్సి వస్తే రైతులతో ముందుగానే చర్చించి పరిహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు.
భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గాలు, సూచిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రాచలం, పర్ణశాలలో తాత్కాలిక ఆసుపత్రులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అంబులెన్స్‌లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, అన్నదానం, ప్రసాదం కౌంటర్లు, ఫుడ్ కోర్టులు, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్ని శాఖలు సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కన్సల్టెంట్ ఏడు రోజుల్లో నివేదిక అందించాలని, తాత్కాలిక సదుపాయాలపై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ గడువు విధించారు. సమావేశంలో డీపీఓ అనూష, సీపీఓ సునీత, దేవాదాయ శాఖ ఈవో దామోదరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




