30 ఏళ్da దాటాక శరీర మార్పులు, NewzFast Telugu (ఆరోగ్యం): యవ్వనంలో ఉన్నంత ఉత్సాహం, శక్తి 30 ఏళ్లు దాటాక క్రమంగా తగ్గుతుందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. ఆహారం విషయంలో ఈ వయసుకు ముందు పనిచేసిన డైట్ ఆ తర్వాత ప్రభావం చూపకపోవడం, ఎనిమిది గంటలు నిద్రపోయినా అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కితే ఆయాసం రావడం వంటి మార్పులు పలువురిలో మొదలవుతుంటాయి.
వీటన్నింటికీ పని ఒత్తిడి లేదా కుటుంబ బాధ్యతలే కారణమని చాలామంది పొరబడుతుంటారు. అయితే ఇవి శరీరం అందించే ముందస్తు హెచ్చరికలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత కండరాలు, హార్మోన్లు, గాఢ నిద్ర, శ్వాస సామర్థ్యం, కొల్లాజెన్, ఎముకల బలం వంటి ఆరు ప్రధాన వ్యవస్థలలో మార్పులు మొదలవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇవి బయటకు పెద్దగా కనిపించకుండా లోలోపలే ప్రభావం చూపుతుంటాయి.
ఈ సంకేతాలను గుర్తించకుండా దాదాపు పదేళ్ల పాటు చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఈ మార్పులను అడ్డుకోవడానికి శరీరానికి సరైన పోషకాలు, శారీరక శ్రమను అందించడం ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం, ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం ద్వారా కండరాలను బలోపేతం చేసుకోవచ్చు.
అలాగే నిద్రకు తగిన ప్రాధాన్యత ఇస్తూ తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముప్పై ఏళ్ల వయసు శరీరం బలహీనపడే సమయం కాదని, కొత్త తరహా జాగ్రత్తలను కోరుకునే దశ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంచనాలపై ఆధారపడకుండా కచ్చితమైన ఆరోగ్య పరీక్షల ద్వారా శరీరంలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడం అవసరం.
సరైన సమయంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో కూడిన జీవితాన్ని సాధించవచ్చని చెబుతున్నారు.




