విదేశీ టీ20 లీగ్‌లు, NewzFast Telugu: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లపై మరింత నియంత్రణ సాధించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమవుతోంది. లీగ్‌ల సంఖ్య భారీగా పెరిగిపోవడం, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు ఆటంకం కలగడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కఠిన నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది.
ఈ మేరకు ఏర్పాటైన సమీక్షా కమిటీ చేసిన ప్రతిపాదనలపై బాలిలో జరగనున్న ఐసీసీ త్రైమాసిక సమావేశంలో వివిధ దేశాల క్రికెట్ బోర్డుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు చర్చించనున్నారు. బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని ఈ సమీక్షా బృందంలో ఈసీబీ ప్రతినిధి రిచర్డ్ గౌల్డ్, క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన టాడ్ గ్రీన్బర్గ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ ఫ్రాంచైజీ లీగ్‌ల నియంత్రణకు సంబంధించి పలు కీలక సిఫార్సులు చేసింది. ఇవి అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌ల ఆర్థిక పరిస్థితి, నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్ల సంఖ్యపై పరిమితి విధించాలన్న ప్రతిపాదన ప్రధానమైనది. ప్లేయింగ్ ఎలెవన్‌లో గరిష్ఠంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే అనుమతించే నిబంధనను అన్ని లీగ్‌లకు తప్పనిసరి చేయాలని కమిటీ సూచించింది.
ఇది అమలైతే యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20), అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
ప్రస్తుతం ఐఎల్టీ20లో గరిష్ఠంగా తొమ్మిది మంది, ఎంఎల్‌సీలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఒకవేళ నలుగురి నిబంధనను కచ్చితంగా అమలు చేస్తే, స్థానిక ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది.




