Miracles of the ER, NewzFast Telugu: హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ అంటేనే టెన్షన్. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లు, మరోవైపు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన డాక్టర్లు ఉంటారు.
చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం ఎదురయ్యే ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు, ఆసుపత్రిలోని రాజకీయాలు వారి పనిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే అంశాలను ఆధారంగా చేసుకున్న తైవానీస్ మెడికల్ డ్రామా సిరీస్ ‘Miracles of the ER’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ నటుడు వాలెస్ హువో, చెరిల్ యాంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎమర్జెన్సీ వార్డులో జరిగే సంఘటనలతో పాటు డాక్టర్ల మధ్య ఉండే అనుబంధాలు, విభేదాలను ఇందులో చూపించారు.
ఈ సిరీస్ కథ ఒక సాధారణ మెడికల్ గ్రాడ్యుయేట్ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. పెద్దగా అకాడమిక్ రికార్డులు లేకపోయినా, అతనిలోని అంకితభావాన్ని గుర్తించిన ఒక సీనియర్ సర్జన్ (వాలెస్ హువో) అతన్ని దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎమర్జెన్సీ రూమ్ (ER) టీమ్‌లోకి ఎంపిక చేస్తాడు.
అక్కడ ఉన్న ఎలైట్ డాక్టర్ల మధ్య తనను తాను నిరూపించుకోవడానికి ఆ కుర్రాడు పడే కష్టాలను ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చే ప్రతి కేసు ప్రాణసంకటమే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు కేసులు వంటి నిమిషాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో డాక్టర్ల మధ్య జరిగే భావోద్వేగ ఘర్షణలు, హాస్పిటల్ రాజకీయాలు ఈ సిరీస్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.
రియల్ లైఫ్ సర్జరీలను తలపించే విజువల్స్, హృదయాన్ని తాకే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి.
వైద్య చికిత్సలతో పాటు డాక్టర్లు, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావోద్వేగాలకు కూడా ఈ సిరీస్ ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా ప్రాణాలు కాపాడలేని పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్యులు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఐజాక్ లీ దర్శకత్వం వహించగా, జేడ్ లీ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి.
ఇది తైవానీస్ మాండరిన్ భాషలో రూపొందగా, ఇంగ్లీష్ డబ్బింగ్, సబ్‌టైటిల్స్ ఆప్షన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మెడికల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు.




