పీసీపీఎన్‌డీటీ చట్టం సిరిసిల్ల, NewzFast Telugu (రాజన్న సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టేందుకు పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అధ్యక్షతన జిల్లా స్థాయి పీసీపీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో చట్టం అమలు తీరు, స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, నిబంధనల పాటింపుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒక నూతన స్కానింగ్ కేంద్రం రిజిస్ట్రేషన్‌కు కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే పీసీపీఎన్‌డీటీ విభాగం పనులను సులభతరం చేసేందుకు కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, ఈ నేరానికి పాల్పడితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రికార్డులు, రిజిస్టర్లు, ఫారాలను సక్రమంగా నిర్వహించాలని, యాక్ట్ బుక్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్కానింగ్ పరీక్షల ధరలు, వైద్యుల పేర్లు, అర్హతల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం మాతృ మరణాలపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.
నెరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన ఒక మాతృ మరణ కేసును కమిటీ సభ్యులు సమగ్రంగా సమీక్షించారు.
గర్భిణీలను గర్భధారణ ప్రారంభ దశలోనే గుర్తించి నమోదు చేయాలని, హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను క్రమం తప్పకుండా వినియోగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
సకాలంలో వైద్య పరీక్షలు, రక్తహీనత నివారణ చర్యలు ద్వారా మాతృ మరణాలను నివారించవచ్చని కమిటీ అభిప్రాయపడింది.
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రబాబు, జీజీహెచ్ సిరిసిల్ల గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. సుగుణ, వేములవాడ ఏరియా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ సంగీతారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్, ఐఎంఏ సిరిసిల్ల ప్రతినిధి డాక్టర్ సిహెచ్.
సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




