చేయూత పింఛన్లు, NewzFast Telugu (ధర్మసాగర్, వరంగల్): అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పింఛన్ల మంజూరుకు ఎలాంటి టార్గెట్ లేదని, నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని ఆయన తెలిపారు.
ధర్మసాగర్ మండలంలోని సుష్మిత గార్డెన్స్‌లో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మసాగర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు రూ.19.43 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు, 27 మంది లబ్ధిదారులకు రూ.27.03 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
అలాగే తుర్కకాశ గ్రామానికి చెందిన 15 మంది మైనారిటీ లబ్ధిదారులకు రూ.9 లక్షల విలువైన వివిధ రకాల టూల్ కిట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు. ధర్మసాగర్ మండలంలో కొత్తగా ఐదు కేటగిరీల కింద మొత్తం 729 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
ఇందులో 370 మంది వితంతువులకు రూ.7,45,920, 209 మంది దివ్యాంగులకు రూ.8,39,344, 44 మంది ఒంటరి మహిళలకు రూ.88,704, 102 మంది గీత కార్మికులకు రూ.2,05,632, నలుగురు చేనేత కార్మికులకు రూ.8,064 చొప్పున నెలవారీ పింఛన్లు అందనున్నాయి. మొత్తం రూ.18,87,664 ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు పింఛన్ల కోసం నాలుగైదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం ఐదు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల పింఛన్లు మంజూరు చేసిందని చెప్పారు.
గ్రామాల్లో ఇంకా అర్హులు ఎవరైనా మిగిలిపోతే సర్పంచులు, ఎంపీడీవోలు గుర్తించి దరఖాస్తులు చేయించాలని సూచించారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత మూడేళ్లలో సుమారు రూ.1,600 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. అండర్‌గ్రౌండ్ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి, హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ భావ్ సింగ్, ఎంపీడీవో అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




