క్లీన్ మాక్స్ ఏపీ పెట్టుబడులు, NewzFast Telugu (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు క్లీన్ మాక్స్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కుల్ దీప్ జైన్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు.
మంత్రి లోకేష్‌తో జరిగిన చర్చల అనంతరం, రూ.36,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ పంపిణీ, పంప్డ్ స్టోరేజ్, డేటా సెంటర్ పార్క్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంస్థ అంగీకారం తెలిపింది. ఈ మొత్తం పెట్టుబడిలో భాగంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై రూ.28,000 కోట్లు పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ 4 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 3 గిగావాట్ల విండ్ మరియు 1 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉంటుంది. అలాగే, పునరుత్పాదక వనరులు సమృద్ధిగా ఉన్న టైర్-2 నగరంలో సొంత విద్యుత్ పంపిణీతో 1 గిగావాట్ (ఐటీ లోడ్) డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.2,000 కోట్లు వెచ్చించనున్నారు.
1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై రూ.6,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కుల్ దీప్ జైన్ వెల్లడించారు. అంతేకాకుండా, శ్రీ సత్యసాయి జిల్లా, పరిగి మండలం, బీచిగానిపల్లె మరియు పరిసర గ్రామాల్లో రూ.1,200 కోట్లతో 200 మెగావాట్ల సోలార్ పార్క్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 25 గిగావాట్-అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్) సామర్థ్యానికి అనుగుణంగా, క్లీన్ మాక్స్ విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు బీఈఎస్ఎస్ను అనుసంధానం చేయాలని కోరారు.




