అరకు సీపీఎం కూటమి ఓటమి, NewzFast Telugu (అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “బలవంతపు మతమార్పిడులు” అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస ఖండించారు.
అరకు వ్యాలీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రాంతీయ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.బి. పోతురాజు అధ్యక్షతన ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం వల్లనే కూటమి ఓటమి చెందిందని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాలు తన “బ్రెయిన్‌చైల్డ్” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అరకు వ్యాలీలో ఆదివాసీలకు స్థానిక ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ మూడేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీల అడవులను హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగ్ పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారని, ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని తెలిపారు.
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో ఆదివాసీలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు గిరిజన ఓటర్ల తెలివిని, వారి స్వేచ్ఛను ప్రశ్నించేలా ఉన్నాయని అన్నారు.
ప్రజల తీర్పును గౌరవించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందని, ఇలాంటి రాజకీయాలు మరో మణిపూర్‌లా పరిణమించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మతం, కులం పేరుతో సమాజాన్ని విభజించే రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో నిజమైన అభివృద్ధి, సంక్షేమం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, గిరిజన ప్రజల తీర్పును గౌరవించాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఉమ మహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జయ, మండల కార్యదర్శి కె.
రామారావు, పి. బాల్ దేవ్, జి.
చిన్న బాబు, సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




