తాటికొండ క్రాస్‌రోడ్డు కారు దగ్ధం, NewzFast Telugu (స్టేషన్ ఘన్పూర్, తెలంగాణ): స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అప్రమత్తంగా వ్యవహరించి బయటకు రావడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.
హనుమకొండలోని సుబేదారికి చెందిన ఎండీ అన్వర్ హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి నిస్సాన్ టెర్రానో కారులో మల్లన్నగుట్టకు బయలుదేరారు. మార్గమధ్యంలో తాటికొండ క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వెంటనే ఇద్దరూ కిందకు దిగారు.
చూస్తుండగానే మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. కొత్తగా ర్యాపింగ్ చేయించిన మరుసటి రోజే కారు దగ్ధం కావడం గమనార్హం.
ప్రమాదంపై సమాచారం అందించిన సుమారు 30 నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
రహదారిపై కారు కాలిపోవడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




