కొమురంభీం జిల్లా నవజాత శిశువు మృతి, NewzFast Telugu (కొమురంభీం జిల్లా, తెలంగాణ): కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని గోలక్ష్మి కాలనీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని దుండగులు చెట్ల పొదల్లో వదిలివెళ్లారు.
అదే సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కలు ఆ పసికందుపై దాడి చేశాయి. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో కుక్కలు పసికందును పీక్కుతింటుండటాన్ని గమనించారు.
వెంటనే కుక్కలను తరిమికొట్టే ప్రయత్నం చేశారు.
కానీ అప్పటికే ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. పసికందుకు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు.
ఎవరు వదిలేశారు, అప్పటికే చనిపోయిందా, లేక కుక్కల దాడిలోనే మృతి చెందిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
ఘటన సమాచారం అందుకున్న చింతలమానేపల్లి పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందు అప్పుడే పుట్టిన చిన్నారిగా ప్రాథమికంగా గుర్తించారు.
పసికందును చెట్ల పొదల్లో పడేసినవారి కోసం సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది. ఆ చిన్నారిని అక్కడ వదిలేసింది ఎవరు, ఏ కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డారు అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.




