సహజ వ్యవసాయం, NewzFast Telugu (ఖమ్మం రూరల్, ఖమ్మం): రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం రూరల్ మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేశ్ సూచించారు.
మండలంలోని ఆరేకోడు తండా గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు భూసారం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు.
జీవామృతం, పంచామృతం, వివిధ రకాల కషాయాల తయారీ విధానాలు, వాటి వినియోగం, పంటలకు కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పంటలు సాగు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను పొందవచ్చని పేర్కొన్నారు.
రైతులు సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచుకుని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి.
వంశీ, ఆరేకోడు తండా సర్పంచ్ జి. మంగమ్మతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.




