గ్రీన్ క్యాబ్స్ హైదరాబాద్, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): వియత్నాం దేశానికి చెందిన గ్రీన్ ఎస్ఎం (Green SM) ఎలక్ట్రిక్ క్యాబ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశీయ రోడ్లపైకి ప్రవేశించిన ఈ క్యాబ్‌లు ఛార్జీల పరంగా ప్రయాణికులకు ఊరట కలిగిస్తున్నాయి.
అయితే స్థానిక క్యాబ్, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇవి పెను సవాలుగా మారుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఈ ఎలక్ట్రిక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా స్థానిక యూనియన్లు నిరసనలు చేపట్టాయి.
ఇప్పుడు తెలంగాణలోనూ ఈ గ్రీన్ క్యాబ్స్ రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి.
‘డ్రైవర్ నహీ.. పార్ట్‌నర్ బనో’ అనే నినాదంతో రోడ్లపైకి వచ్చిన గ్రీన్ ఎస్ఎం క్యాబ్స్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ అంశంపై గురువారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
సంస్థలో డ్రైవర్‌గా నియమిస్తే జీతం, ఈఎస్ఐ (ESI), ఈపీఎఫ్ (EPF) వంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందని, ‘పార్ట్‌నర్’ పేరుతో చేర్చుకుంటే అవేమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఆయన ఆరోపించారు. వారం రోజుల్లో 500 కిలోమీటర్లు నడపాలనే షరతు పెట్టారని, లేకపోతే డబ్బులు రావని చెప్పారు.
మొదట వారానికి రూ.8,000 ఇస్తామని ఆశ చూపి, క్రమంగా అది రూ.1,000కి పరిమితమవుతుందని ఆయన ఆరోపించారు. ఒక విదేశీ కంపెనీ తన ప్రకటనల కోసం స్థానిక డ్రైవర్ల పొట్ట కొడుతోందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మూటలు అప్పజెప్పి ఆ కంపెనీ తెలంగాణకు వచ్చిందని తమకున్న సమాచారమని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది క్యాబ్, ఆటో డ్రైవర్ల పట్ల ప్రభుత్వం ఎందుకు కక్షగట్టిందని ఆయన ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ, గ్రీన్ ఎస్ఎం సంస్థ స్పందన కోసం ఎదురుచూడాల్సి ఉంది.
ఇప్పటికే కర్ణాటకలో ఈ గ్రీన్ క్యాబ్స్‌పై వివాదం చెలరేగగా, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఈ అంశంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.




