చుక్కాయిపల్లి ట్యాంక్ బండ్, NewzFast Telugu (కొల్లాపూర్, తెలంగాణ): కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.6.5 కోట్ల నిధులతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు గురువారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొల్లాపూర్ ప్రాంతానికి చుక్కాయిపల్లి చెరువు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెరువు పరిసరాలను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలోని ప్రకృతి అందాలు, జలవనరులు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
చుక్కాయిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుకుంటే కొల్లాపూర్ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే పట్టణ సుందరీకరణకు మరింత వన్నె చేకూరనుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం, కాంగ్రెస్ నాయకులు మాచూపల్లి బాలస్వామి, పెబ్బేటి శేఖర్, మద్దెల రాందాస్, పసుపుల నరసింహ, మున్సిపల్ కౌన్సిలర్లు జూపల్లి అన్వర్, బోరెల్లి మహేష్ పాల్గొన్నారు.




