దీర్ఘకాలిక వ్యాధులు ఒత్తిడి, NewzFast Telugu (ఫిన్లాండ్ అధ్యయనం ఆధారంగా): ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి ఒక సహజమైన ప్రక్రియ. అయితే అది పరిమితికి మించినప్పుడు ప్రమాదకరంగా మారవచ్చు.
అనారోగ్యాలు, దీర్ఘకాలిక సమస్యలతో పోరాడుతున్నవారిపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఫిన్లాండ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ఈ వివరాలు ‘హెల్త్ ప్రమోషన్ ఇంటర్నేషనల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒక అనారోగ్య సమస్యతోనే సతమతమవుతున్నప్పుడు, రెండు లేదా అంతకంటే ఎక్కువ సమస్యలు వెంటాడితే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి ఈ భారాన్ని మరింత పెంచుతుందని పేర్కొంది.
అధ్యయనంలో భాగంగా సుమారు 4,000 మందికి పైగా పెద్దల ఆరోగ్య డేటాను నిపుణులు విశ్లేషించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారితో పోలిస్తే, ఒకటి కంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై స్ట్రెస్ ప్రభావం రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
రోజూ వేళకు మందులు వేసుకోవడం, వరుస ఆస్పత్రి అపాయింట్‌మెంట్లు, డాక్టర్ల సూచనలను అర్థం చేసుకోవడం వంటివి రోగులకు పెద్ద సవాల్‌గా మారి మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. సమయానికి సమాచారం అర్థం కాకపోవడంతో చాలామంది ఆందోళనకు గురవుతుంటారని వివరించింది.
అయితే, ఏయే ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడ వెతుక్కోవాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసినవారు (హెల్త్ లిటరసీ ఉన్నవారు) ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. సరైన, నమ్మదగిన వైద్య సమాచారం అందుబాటులో ఉంటే రోగుల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి జీవితం ప్రశాంతంగా సాగాలంటే కేవలం మందులు మాత్రమే సరిపోవని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు, సమాజం, వైద్య సిబ్బంది నుంచి మానసిక మద్దతు అవసరమని చెబుతున్నారు.
సులభమైన భాషలో మాట్లాడటం, రోగుల కష్టాలను అర్థం చేసుకొని ఓపికగా సలహాలు ఇవ్వడం, ఆస్పత్రి సేవలను సులభంగా పొందడంలో సహాయపడటం వంటివి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని స్పష్టం చేస్తున్నారు.
మొత్తానికి, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆరోగ్య సమాచారాన్ని అందించడం దీర్ఘకాలిక రోగుల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
గమనిక: ఈ వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.
అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.




