మురసు తుపాను, NewzFast Telugu: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి మురసు తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. గత ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుపాను ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. నవంబర్ 3, మంగళవారం నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల మేర సముద్రపు నీటితో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తీర ప్రాంత ఓడరేవుల్లో ప్రమాద సూచికలు ఎగురవేశారు. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్లో 10వ నంబర్ సిగ్నల్, మచిలీపట్నం పోర్టులో 9వ నంబర్, కృష్ణపట్నంలో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.




