నోయెల్ టాటా, NewzFast Telugu: టాటా గ్రూప్‌లో కీలకమైన నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, టాటా కుటుంబ సభ్యుడు నోయెల్ టాటా, గ్రూపులోని పలు కంపెనీల నుంచి పదవీ విరమణ చేశారు.
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (టీఐసీ) చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి ఆయన వైదొలగడంతో 16 ఏళ్లకు పైగా సాగిన ఆయన సారథ్య శకం ముగిసింది. ఆయన సేవలకు గుర్తింపుగా కంపెనీ బోర్డు ఆయన్ను ‘చైర్మన్ ఎమెరిటస్’గా గౌరవప్రదంగా నియమించింది.
టాటా గ్రూప్ పాలనా మార్గదర్శకాల ప్రకారం, నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లకు 70 ఏళ్లు పదవీ విరమణ వయసుగా నిర్దేశించారు. ఈ నెలలో నోయెల్ టాటా 70వ పడిలోకి అడుగుపెట్టడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ఆయన పదవీకాలం నిన్నటితో ముగియగా, ఆయన స్థానంలో ప్రముఖ కార్పొరేట్ న్యాయవాది, ఏజడ్‌బీ & పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు బహ్రామ్ వాకిల్ నేటి నుంచి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
నోయెల్ టాటా నాయకత్వంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించిందని, వాటాదారులకు సుస్థిరమైన విలువను అందించిందని కంపెనీ ఒక ప్రకటనలో కొనియాడింది.
కొత్త చైర్మన్‌గా నియమితులైన బహ్రామ్ వాకిల్ కార్పొరేట్ పునర్‌వ్యవస్థీకరణ, దివాలా చట్టాలు, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటి రంగాల్లో నిపుణుడిగా పేరుగాంచారు. ఆయన ఈ ఏడాది మార్చి నుంచి టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వైస్-చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
ఆయనతో పాటు నియోస్ట్రాట్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌పి వ్యవస్థాపకుడు అబిజర్ షబ్బీర్ దివాంజీని అదనపు నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి బోర్డు నియమించింది.




