అమిత్ షా రేవంత్ రెడ్డి ఈవీఎం సర్ వివాదం, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓట్ బచావో కార్యక్రమంలో ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని, సర్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
బీజేపీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ చేపట్టిన ఓట్ బచావో కార్యక్రమం ఓటర్ల కోసం కాదని, చొరబాటుదారులను కాపాడేందుకేనని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరిదీ ఒకే తరహా మనస్తత్వమని వ్యాఖ్యానించారు.
సర్ ప్రక్రియతో తమకు సంబంధం లేదని, అది కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే నిరంతర ప్రక్రియ అని అమిత్ షా స్పష్టం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో సర్ ప్రక్రియ లేకపోయినా మోదీ గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సర్ ప్రక్రియను ఆయన సమర్థించారు. అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్లకు పైగా ఓట్లు చొరబాటుదారులవేనని, మృతి చెందిన వారి ఓట్లను కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఓటరు జాబితాల ప్రక్షాళన జరగాలని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో ఈవీఎంలు, సర్ ప్రక్రియపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సిద్ధమని అమిత్ షా అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు శపథం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలు చెల్లిస్తున్న పన్నులను రాహుల్ గాంధీకి దోచిపెడుతున్నారని విమర్శించారు.

