వనపర్తి రోడ్ల విస్తరణ, NewzFast Telugu (వనపర్తి, తెలంగాణ): రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఆయన పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పొట్టి శ్రీరాములు చౌరస్తా పరిసర ప్రాంతాలలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విస్తరణ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే రోడ్ల విస్తరణ ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పట్టణంలో మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
పట్టణ అభివృద్ధి ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు, వ్యాపారులు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరారు.
వనపర్తి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కదిరె రాములు, స్థానిక కౌన్సిలర్ రవి యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బ్రహ్మచారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ బి. కృష్ణ, పాకనాటి కృష్ణ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




