మురుగు కాలువలో పసికందు మృతదేహం, NewzFast Telugu (కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తెలంగాణ): కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే ఓ పసిప్రాణం కడతేరింది. కన్నవారి కర్కశత్వానికో, మరే ఇతర కారణానికో బలై మురుగు కాలువలో విగతజీవిగా పడి ఉన్న ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో గురువారం ఉదయం ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. మురుగు కాలువ వద్ద వీధి కుక్కలు ఒక కవర్ను లాగుతుండటాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు.
అనుమానంతో దగ్గరకు వెళ్లి చూడగా, ఆ కవర్లో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం కనిపించడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న చింతలమానేపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దారుణానికి పాల్పడి, పసికందును అక్కడ పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గ్రామంలోకి వచ్చే దారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ విచారణ వేగవంతం చేశారు.




