ములుగు గుడుంబా డ్రమ్ములు, NewzFast Telugu (ములుగు జిల్లా, తెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున జరుగుతున్న గుడుంబా తయారీ స్థావరాలపై వెంకటాపురం పోలీసులు మెరుపు దాడి చేశారు.
అడవిలోని వాగులో చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి, నీటిని నిల్వ చేసి, ఆ నీటి అడుగున గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం, ముడిసరుకు నిండిన డ్రమ్ములను దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. బయటకు కనిపించకుండా ఈ ఏర్పాటు చేయడంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
ఈ దాడుల్లో మొత్తం 106 గుడుంబా డ్రమ్ములను వెలికితీసిన పోలీసులు వాటిని దగ్ధం చేశారు. గొయ్యి తవ్వి భద్రపరిచిన సారాయిని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
గత నాలుగు రోజులుగా వెంకటాపురం పోలీసులు ఈ ప్రాంతంలో గుడుంబా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ముత్తారం అడవుల్లో ఈ తయారీ బయటపడింది.
గుడుంబా తయారీదారులు ఎన్ని కొత్త పద్ధతులు అనుసరించినా వదిలిపెట్టబోమని వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, ఎస్సైలు కొప్పుల తిరుపతిరావు, తిరుపతిరెడ్డి హెచ్చరించారు. ఈ దాడులు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.




