ఐపీఎల్ జట్ల సంఖ్య, NewzFast Telugu: ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. 2028 నుంచి 12 జట్లతో ఐపీఎల్ నిర్వహిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
ఈ అంశంపై బోర్డులో అధికారికంగా, అనధికారికంగా కూడా ఎలాంటి చర్చ జరగలేదని ఆయన వెల్లడించారు. 2027లో జరిగే ఐపీఎల్ 20వ సీజన్ కావడంతో దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు సైకియా తెలిపారు. ఆ సీజన్‌ను ఘనంగా నిర్వహించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
అంతకుమించి ఎలాంటి ప్రణాళికలు పరిశీలించడం లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. 12 జట్ల విస్తరణపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు.
2027 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీల ఆటగాళ్ల కొనుగోలు పరిమితిని రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచుతారన్న ప్రచారంపైనా సైకియా స్పందించారు. టీమ్ పర్స్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలం డిసెంబరు 16న జరుగుతుందని, ప్రస్తుత సైకిల్‌లో ఇదే చివరిదని చెప్పారు. ఆ తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు.
ప్రస్తుత ఏప్రిల్-మే విండోకు బదులుగా జనవరిలో ఐపీఎల్ నిర్వహించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, నటి జూహీ చావ్లా ఇటీవల ఎక్స్‌లో చేసిన ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు సైకియా నిరాకరించారు. 2027 ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానుందని, ప్రస్తుతం దాని నిర్వహణపైనే దృష్టి పెట్టామని ఆయన స్పష్టం చేశారు.




