జమ్మూ కాశ్మీర్ ఎస్‌పీఓ అదృశ్యం, NewzFast Telugu (జమ్మూ కాశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కుర్గాం జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొద్ది గంటల్లోనే ఇద్దరు పోలీస్ స్పెషల్ ఆఫీసర్లు అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
కిష్త్వార్ జిల్లా, దచ్చన్ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాల నుంచి ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. దీంతో భద్రతా దళాలు భారీ సంయుక్త గాలింపు చర్యలను ప్రారంభించాయి.
అదృశ్యమైన వారిని బాబీ చంద్ (57), రాశ్పాల్ కుమార్ (45)గా గుర్తించారు. వీరు దచ్చన్‌లోని కియార్ గ్రామంలో ఉన్న స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) క్యాంపులో విధులు నిర్వహిస్తున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు ఎస్‌పీఓలు కియార్ క్యాంపు నుంచి ధర్నా-మార్వాలోని ఆర్మీ పోస్ట్‌కు వెళ్తుండగా మిస్ అయినట్లు తెలుస్తోంది. మొదట్లో వారి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి.
దీంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది.
ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కఠినమైన పర్వత ప్రాంతాలు, అడవులతో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బృందాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ ఘటనను ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపెట్టవద్దని అధికారులు సూచించారు.




