ఇండోనేషియా ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రాజీనామా, NewzFast Telugu (జకార్తా): ఇండోనేషియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకబుమింగ్ రాకా తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఆయన సమర్పించిన హైస్కూల్ విద్యార్హత పత్రం చెల్లదని ఇండోనేషియా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన రాజీనామా లేఖను బుధవారం నేరుగా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు సమర్పించినట్లు గిబ్రాన్ సహాయకుడు బుడి అరీ వెల్లడించారు. అయితే అధ్యక్షుడు దీనిని ఆమోదించారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇండోనేషియా చట్టాల ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేవారు కనీసం సీనియర్ సెకండరీ స్కూల్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. సింగపూర్, ఆస్ట్రేలియాలో చదువుకున్న గిబ్రాన్ సమర్పించిన ఇండోనేషియా ‘ఈక్వివలెన్స్ సర్టిఫికెట్’కు ఎలాంటి విదేశీ డిప్లొమా లేదా సరైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
అక్టోబర్‌లో రాజ్యాంగ న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, గిబ్రాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు (అభిశంసన) పార్లమెంటరీ చర్యలు చేపట్టాలని 100 మందికి పైగా చట్టసభ సభ్యులు మద్దతు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గిబ్రాన్ రాజీనామాతో మాజీ అధ్యక్షుడు జోకో విడోడో (జోకోవి), ప్రస్తుత అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మధ్య రాజకీయ విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ప్రబోవో విజయం వెనుక జోకోవితో కుదుర్చుకున్న రాజకీయ పొత్తు కీలక పాత్ర పోషించింది. అప్పట్లో 36 ఏళ్ల వయసున్న జోకోవి కుమారుడు గిబ్రాన్ పోటీ చేసేందుకు వీలుగా, కనీస వయోపరిమితి 40 ఏళ్ల నిబంధన నుంచి రాజ్యాంగ న్యాయస్థానం మినహాయింపు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రబోవో, జోకోవి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన కొత్త రాజధాని ‘నుసంతారా’ నిర్మాణంపై ఆసక్తి చూపకపోవడం, జోకోవి విధేయులను కీలక పదవుల నుంచి తప్పించడం వంటి చర్యలతో ఇరువురి మధ్య దూరం పెరిగింది.
మరోవైపు ప్రబోవో ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత పాఠశాల భోజన పథకానికి నిధుల కొరత వేధిస్తోంది.
దీనికి తోడు దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా అడవుల్లో కార్చిచ్చు చెలరేగడం, స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆరోపణలు, అవినీతిపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు చోటుచేసుకోవడంతో ఇండోనేషియాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొంది.




