హార్దిక్ పాండ్యా, NewzFast Telugu (న్యూఢిల్లీ): ఐపీఎల్ చరిత్రలోనే భారీ ట్రేడ్ డీల్ ముగిసింది. గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ల పరస్పర బదలాయింపు అధికారికమైంది.
ముంబై ఇండియన్స్ నుంచి రూ.18 కోట్లకు పాండ్యాను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, బదులుగా అర్ష్‌దీప్‌ను అతడి ప్రస్తుత ధర రూ.18 కోట్లకు ముంబైకి అమ్మేసినట్టు ఐపీఎల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. హార్దిక్ ప్రస్తుత ధర రూ.16.35 కోట్లు కాగా, కింగ్స్ రూ.1.65 కోట్లు అదనంగా చెల్లించి తీసుకోవడం విశేషం.
ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.18 కోట్లకు రాజస్థాన్ నుంచి కొనుగోలు చేయగా, బదులుగా జడేజాను రూ.14 కోట్లకు, సామ్ కర్రాన్‌ను రూ.2.4 కోట్లకు అమ్మేసింది. నిబంధనల ప్రకారం పాండ్యాకు అధికంగా లభించిన రూ.1.65 కోట్లలో సగం ముంబై ఫ్రాంచైజీకి, సగం ఆటగాడికి దక్కుతుంది.
తొలి విడతలో ముంబై తరఫున ఏడు సీజన్లపాటు ఆడిన హార్దిక్‌ను 2022లో గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగించింది. అరంగేట్రంలోనే గుజరాత్‌ను విజేతగా నిలిపిన పాండ్యా, 2023లో మరోసారి ఫైనల్‌కు చేర్చాడు.
అయితే 2024లో భారీ డీల్‌తో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చాడు.
ఈ పర్యాయం మాత్రం అతడికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్‌ను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం బెడిసి కొట్టింది. 2025లో ముంబై ప్రదర్శన ఫర్వాలేదనిపించినా, 2026లో పేలవంగా సాగింది.
సీనియర్లతో ఇమడలేని పరిస్థితుల్లో పాండ్యా ముంబైను వీడతాడనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది.
తొలుత చెన్నై, ఆ తర్వాత రాజస్థాన్‌కు వెళతాడనే ఊహాగానాలు వెలువడినా, ఎట్టకేలకు పంజాబ్ అతడిని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు.
వ్యక్తిగా, ఆటగాడిగా పాండ్యా అంటే ఎంతో గౌరవం ఉందని, అతడి భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన హార్దిక్, మళ్లీ తిరిగి వచ్చి ముంబైను నడిపించాడని ఆయన గుర్తుచేశారు.




