తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం, NewzFast Telugu (హైదరాబాద్): ప్రభుత్వ నిర్ణయాలు కొందరికి కష్టం, నష్టం కలిగించి ఉండవచ్చని, అయినప్పటికీ మంచి నిర్ణయం తీసుకుంటే కొన్ని తరాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 11న మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ఆయన ప్రారంభించారు.
తమ్మిడికుంట అభివృద్ధిలో భాగంగా 14 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ అభివృద్ధికి సహకరించిన సినీ నటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల్లో పోటీపడదామని, ఇప్పుడు మాత్రం అందరూ అభివృద్ధిలో కలిసి రావాలని ముఖ్యమంత్రి కోరారు. హైటెక్ సిటీతో పాటు తమ్మిడికుంట గురించి ప్రజలు మాట్లాడుకునేలా అభివృద్ధి జరుగుతుందని, ఐటీ నిపుణులు ‘వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట’ అని చెప్పుకునే స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు.
చెరువుకు భద్రతతో పాటు అన్ని వసతులు కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 1,372 చెరువుల్లో 50 శాతం కనుమరుగయ్యాయని తెలిపారు. చెరువుల ఆక్రమణల వల్ల వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై నీరు నిలిచి కాలనీలు జలమయం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
చెరువు ఆవరణలో జమ్మి చెట్టు నాటాలని కమిషనర్ రంగనాథ్‌కు సూచించినట్లు కూడా చెప్పారు.
తమ్మిడికుంట అభివృద్ధి కోసం నాగార్జున రెండెకరాల భూమిని ఉదారంగా ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. మూసీ నది పరివాహకంలోనే హైదరాబాద్ నాగరికత అభివృద్ధి చెందిందని, వందేళ్ల క్రితమే నిజాం మూసీ పరివాహకాన్ని అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే మూసీ ప్రక్షాళన తప్పనిసరని తెలిపారు.
మూసీ పునరుజ్జీవనం తొలి దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఈ ప్రక్రియలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మూసీని కేవలం సుందరీకరణ కాకుండా పునరుజ్జీవనం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




