బంగాళాఖాతంలో అల్పపీడనం, NewzFast Telugu (విశాఖపట్నం, అమరావతి): దక్షిణ అండమాన్ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
14వ తేదీ నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి, 15వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.
తుఫాన్ 17వ తేదీ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనున్నదని అంచనా. ఈ నెల 15 నుంచి బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, నైరుతి మరియు మధ్య బంగాళాఖాతం వైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అయితే వాయుగుండం ఎటు పయనిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండకపోవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలని ప్రజలకు సూచించడమైంది.
ఇదిలావుండగా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో బుధవారం ఉదయం మంచు కురిసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.




