ఇనుప పొడి విద్యుత్ ఉత్పత్తి, NewzFast Telugu (జర్మనీ): రోజురోజుకు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బొగ్గు మండించడం వల్ల వెలువడే కాలుష్యం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది.
మరోవైపు సౌర, పవన విద్యుత్ వంటి సాంప్రదాయేతర విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేయడం కూడా సవాలుగా మారింది. ఈ సమస్యలన్నింటికీ ఒకే సాంకేతికతతో పరిష్కారం చూపే దిశగా జర్మనీలోని కార్ల్స్రూహే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి తెరతీశారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుకు బదులుగా ఇనుప పొడి (ఐరన్ డస్ట్)ను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానానికి వారు అంకురార్పణ చేశారు. పాత థర్మల్ ప్లాంట్లలో స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుందని, ఎలాంటి విష వాయువులు వెలువడవని వారు చెబుతున్నారు.
ప్లాంటులో మండిపోయి మిగిలే ఐరన్ ఆక్సైడ్ (తుప్పు)ను మళ్లీ ఇనుప పొడిగా మార్చి వినియోగించుకోవచ్చని కూడా అంటున్నారు.
పొడి రూపంలో ఉన్నప్పుడు ఇనుము సహా అనేక లోహాలకు తగిన ఉష్ణోగ్రత అందితే అవి మండి శక్తిని విడుదల చేస్తాయి. మండినప్పుడు గాలిలోని ఆక్సిజన్, ఇతర రసాయనాలతో చర్య జరిపి ఖనిజ సమ్మేళనాలుగా మారుతాయి.
వాటిని తిరిగి లోహంగా మార్చడం కష్టం. అయితే ఐరన్ ఆక్సైడ్‌ను తిరిగి ఇనుముగా మార్చడం సులువు కావడంతో శాస్త్రవేత్తలు ఇనుమును ఎంచుకున్నారు.
ల్యాబ్‌లో థర్మల్ కేంద్రాల్లోని బాయిలర్ తరహా చిన్నపాటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇనుప పొడిని ప్రయోగాత్మకంగా మండించారు. దాని నుంచి వెలువడిన శక్తిని, ఇతర అంశాలను పరిశీలించారు.
ఇనుము మండి ఏర్పడిన ఐరన్ ఆక్సైడ్‌ను హైడ్రోజన్ సహాయంతో తిరిగి ఇనుముగా మార్చారు. ఒకరకంగా ఇది పునరుత్పాదక ఇంధనమని వారు పేర్కొన్నారు.
ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్లలోనే ఇనుప పొడిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్త జూలియా షూలర్ తెలిపారు. బాయిలర్లు, ధూళి ఫిల్టర్లు వంటి కొన్ని భాగాల్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆమె వివరించారు.
గ్లోబల్ వార్మింగ్ ఆందోళనతో ప్రపంచవ్యాప్తంగా మూతపడుతున్న థర్మల్ ప్లాంట్లను ఈ విధానంలో మళ్లీ వినియోగించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.
హైడ్రోజన్ పవర్ ప్లాంట్లు, బ్యాటరీ విద్యుత్ స్టోరేజీ ప్లాంట్లు, హైడ్రోజన్ నిల్వ వంటి కాలుష్య రహిత ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ఇనుప పొడి ఆధారిత థర్మల్ విద్యుదుత్పత్తికి చాలా తక్కువ ఖర్చవుతుందని ఆమె తెలిపారు. అయితే ఇనుప పొడి ఉత్పత్తి, థర్మల్ ప్లాంట్లను ఇనుప పొడితో పనిచేసేలా మార్చడానికి అవసరమైన మార్పులు, ఐరన్ ఆక్సైడ్‌ను తిరిగి ఇనుముగా మార్చే వ్యయం వంటివి కీలకమని ఆమె వెల్లడించారు.
థర్మల్ ప్లాంట్లలో బొగ్గు వినియోగంతో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి పలు విషవాయువులు వెలువడతాయి. కానీ ఇనుప పొడి వినియోగంతో ఎలాంటి విష వాయువులు వెలువడలేదని వర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగ శాస్త్రవేత్త జూలియా షూలర్ వెల్లడించారు.
ఈ ప్రక్రియలో ఇనుప పొడిని పునర్వినియోగ ఇంధనంగా వాడుకోవచ్చని కూడా ఆమె తెలిపారు.




