పాలమూరు వలసలు, NewzFast Telugu (మహబూబ్‌నగర్ జిల్లా): మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో పాలమూరును మళ్లీ వలసలకు కేరాఫ్‌గా మార్చే కుట్ర జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చడంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లి, మహ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లో ఎండిన పంటలను ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే, ప్రభుత్వం రైతుమేళాలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మళ్లీ ముంబై, పుణె బస్సులు నడిపే రోజులు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
కరువు మండలాలను ప్రకటించి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.




