ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత, NewzFast Telugu (హైదరాబాద్): వైద్య విధాన పరిషత్ పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానల్లో మందుల కొరత వేధిస్తోంది. మందుల కొరతపై రోగులు నిలదీస్తే వారిని సముదాయించేందుకు అక్కడి సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు.
మరికొందరు సిబ్బంది “డాక్టర్ రాసిన మందులు లేవు, అవి బయట కొనండి” అని సూటిగా చెబుతున్నారు. దీంతో రోగులు, సిబ్బంది మధ్య వాగ్వాదం తలెత్తి కొన్నిసార్లు గలాటకు దారితీస్తున్నట్లు ఫార్మసీ సిబ్బందే వాపోతున్నారు.
సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయా ఆరోగ్య కేంద్రాలకు రోగుల అవసరానికి సరిపడా మందులు సరఫరా చేయాలి. అయితే క్వార్టర్లీ డ్రగ్స్ కోటా ఎప్పటికప్పుడు విడుదల కావడం లేదని, దీంతో మందుల కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.
గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది ఓపీ రోగులు చికిత్స కోసం వస్తారు. సరిపడా మందుల కోటా సకాలంలో విడుదల కాకపోవడంతో లోకల్ పర్చేజ్ ద్వారా కొన్ని అత్యవసర మందులను కొనుగోలు చేస్తారు.
అయితే కొద్ది రోజులుగా సప్లయర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు మందుల సరఫరాను నిలిపివేశారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
దీంతో టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయకపోవడం, సప్లయర్లు సరఫరాను నిలిపివేయడంతో గోల్కొండతో పాటు నాంపల్లి తదితర ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మందుల కొరత ఉందని చెబుతున్నారు. కనీసం అవసరమైన మందులు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
మందుల కొరతను కప్పిపుచ్చుకునేందుకు కొందరు సిబ్బంది ప్రత్యామ్నాయంగా అసమర్థమైన మందులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీపీఎం, బీ-కాంప్లెక్స్ వంటి మందులతో పాటు జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన చిన్నపాటి మందులు కూడా అందుబాటులో లేవని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఆధార్ అంశంపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసినా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది తీరు మారడం లేదని రోగులు చెబుతున్నారు.
ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆధార్ లేకపోతే చికిత్స ఇవ్వరా అని న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని దవాఖానల్లో ఆధార్ లేనిదే ఓపీ చీటీ ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆధార్ తీసుకురాకపోతే సిబ్బంది వెనక్కి పంపుతున్నారని, సీహెచ్సీలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు.




