ఢిల్లీ-ఎన్‌సీఆర్ గ్రీన్ క్రాకర్స్ సుప్రీంకోర్టు అనుమతి, NewzFast Telugu: దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 7, 8 తేదీల్లో పర్యావరణహిత గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 300 దాటి వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆంక్షల మధ్య ఈ వెసులుబాటు కల్పించినట్లు కోర్టు పేర్కొంది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి.
వరాళేలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం బయటపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, పండుగ ప్రాముఖ్యతను సమతుల్యం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, సైలెన్స్ జోన్లుగా గుర్తించిన ప్రదేశాలకు 300 మీటర్ల పరిధిలో మాత్రం కాల్చకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలను అధికారులు వెంటనే గుర్తించి పబ్లిక్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
2024లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విధించిన సంపూర్ణ నిషేధం వల్ల ఏక్యూఐలో పెద్దగా మెరుగుదల కనిపించలేదని కోర్టు పేర్కొంది. సరైన డేటా లేకుండా శాశ్వత నిషేధం విధించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.
గ్రీన్ క్రాకర్స్ విక్రయాల కోసం జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ప్రత్యేక స్థలాలను కేటాయించాలని, నకిలీ క్రాకర్స్ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేపట్టాలని కూడా ఆదేశించింది.


