నిరుద్యోగిత రేటు, NewzFast Telugu (హైదరాబాద్): దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో 4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 4.7 శాతానికి ఎగబాకినట్టు సంస్థ తెలిపింది.
ఈ నెల వ్యవధిలోనే ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎంఐఈ పేర్కొంది. ఉద్యోగకల్పన రేటు 2020 జనవరిలో 39.7 శాతంగా ఉండగా, గత అక్టోబర్‌లో 39.3 శాతానికి పడిపోయింది.
అంటే కరోనా సంక్షోభ సమయం కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత కష్టంగా ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 3.4 శాతంగా ఉండగా అక్టోబర్‌నాటికి 4.7 శాతానికి పెరిగింది. మహిళల్లో నిరుద్యోగిత రేటు 11.7 శాతం నుంచి 12.7 శాతానికి చేరింది.
దేశంలోని 250 జిల్లాల్లో 15-29 ఏండ్ల మధ్య వయసున్న యువతలో 25 శాతం మందికి ఉద్యోగాలు లేవని, వారు ఉన్నత విద్యను కూడా అభ్యసించడం లేదని సీఎంఐఈ గణాంకాలు చెబుతున్నాయి.
నీతిఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఈ వయసు గల యువతలో 8.7 కోట్ల మందికి ఉద్యోగం లేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు చదువును కొనసాగించలేకపోతున్నారని, నైపుణ్య శిక్షణ కూడా పొందలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో కేవలం 8.5 శాతం మందికి మాత్రమే తమ అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తోందని నీతిఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇన్‌డీడ్ సర్వేలో 72 శాతం మంది ఉద్యోగార్థులు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు కూడా పని అనుభవం అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేవలం 14 శాతం మంది మాత్రమే తాము ఆశించిన మొదటి ఉద్యోగాన్ని పొందగలిగారు.
అవకాశాల కొరత వల్ల కెరీర్ ఎంపికలో రాజీపడాల్సి వస్తోందని 43 శాతం మంది తెలిపారు.
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగి ఉత్పాదకత, దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.




