నిర్మల్ రైతుగర్జన సభ, NewzFast Telugu (నిర్మల్, తెలంగాణ): బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుగర్జన సభతో నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియడంతో సాయంత్రం 4 గంటలకే జనం సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
కేటీఆర్ ప్రసంగంతో సభలో ఉత్సాహం పెల్లుబికింది. ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని ఆయన చేసిన వ్యాఖ్యకు రైతులు, యువత మద్దతు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతుబంధు, 24 గంటల విద్యుత్, రైతు బీమా, పంటల కొనుగోళ్లు వంటి పథకాలు అమలైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, పంటలకు రూ.500 బోనస్ వంటి హామీలను అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఈ హామీలపై సభలో ప్రదర్శించిన వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సభకు హాజరైన రైతులు తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. రైతుబంధు జమ కాలేదని, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడం లేదని, పంటలకు సరైన ధర దక్కడం లేదని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళారుల దోపిడీ పెరిగిందని కూడా ఆరోపించారు.
ఈ సభకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, భూక్యా జాన్సన్ నాయక్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్‌కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా నలుమూలల నుంచి ప్రైవేట్ వాహనాల్లో రైతులు, కార్యకర్తలు తరలివచ్చారు.
సభ అనంతరం రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
నిర్మల్ పట్టణం అంతటా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. కేటీఆర్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.




