ఇంటర్ విద్య విలీనం, NewzFast Telugu (తెలంగాణ): పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం దురదృష్టకరమని ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘాల జేఏసీ విమర్శించింది. ముఖ్యమంత్రి నిర్ణయం విద్యారంగాన్ని వెనక్కి తీసుకెళ్తుందని జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు.
ఎవరినీ సంప్రదించకుండా ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవటం సరికాదని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇంటర్ విద్య ప్రత్యేకంగా ఉండటం వల్లనే జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యావంతులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.




