ఇంటర్ విద్య విలీనం, NewzFast Telugu (హైదరాబాద్): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య ముగియనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 11, 12 తరగతులు పాఠశాల విద్యలో భాగం కానున్నాయి.
సీబీఎస్ఈతో పాటు దేశంలో మెజారిటీ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 10+2 విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచే అమలు చేయాలని సీఎం భావించినా, సమయం సరిపోదని అధికారులు చెప్పడంతో వాయిదా పడింది.
ఈసారి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని బుధవారం జరిగిన సమీక్షలో సీఎం తేల్చిచెప్పారు.
దీంతో ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు విద్యామంత్రిగా ఉన్నప్పుడు 1969-70లో మొదలైన ఇంటర్ విధానం దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముగియనుంది. కొత్త విధానంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8 వరకు సెకండరీ, 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ విద్యగా పునర్ వ్యవస్థీకరించాలని సీఎం ఆదేశించారు.
దేశంలో 18 రాష్ట్రాల్లో 10+2 విధానమే అమల్లో ఉందని, విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్పొరేట్ కాలేజీల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రకటించామని తెలిపారు.
పదో తరగతి తర్వాత సగటున 40 శాతం విద్యార్థులు చదువు మానేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. వారిలో ఎక్కువ మంది బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలేనని చెప్పారు. 11, 12 తరగతులు బడుల్లోనే ఉండే కేంద్రీయ, నవోదయ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.08 లక్షలు ఖర్చవుతోందని, ఇంటర్ కాలేజీల విలీనంతో అది రూ.60 వేలకు తగ్గుతుందని సీఎం తెలిపారు. జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.
ఇంటర్ విద్య పాఠశాల విద్యలో విలీనం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పాఠశాల విద్యా శాఖ పరిధిలోకి వస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇవి 9-12 తరగతులతో సీనియర్ సెకండరీ స్కూళ్లుగా మారనున్నాయి.
మండలానికో 12వ తరగతి బడి ఉండేలా 120 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు డిసెంబరు 1న నోటిఫికేషన్ ఇచ్చి, ఏప్రిల్ 30లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వర్సిటీల్లో దాదాపు 900 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు అద్దె భవనాల్లో కొనసాగకూడదని, సొంత భవనాలు నిర్మించాలని కూడా ఆదేశించారు.




