మండల పరిషత్ ఎన్నికలు, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మండల పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేసింది. బుధవారం ఖైరతాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు గడీల కుమార్‌గౌడ్, కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవీరవీందర్ ఈ డిమాండ్‌ను వినిపించారు.
సకాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సుమారు రూ.5,600 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ నిధులను కోల్పోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. స్థానిక సంస్థల నేతగా రాజకీయ ప్రయాణం ప్రారంభించానని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని వారు విమర్శించారు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పదవీకాలం ముగియగానే ఎన్నికలు నిర్వహించారని, తెలంగాణలో మాత్రం ఎన్నికలను దాటవేస్తున్నారని సంఘం నేతలు ప్రశ్నించారు. రిజర్వేషన్లను సాకుగా చూపి మొత్తం స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు.
సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలకు గౌరవం కల్పించింది గత కేసీఆర్ ప్రభుత్వమేనని సంఘం నేతలు పేర్కొన్నారు. సర్పంచ్‌ల వేతనాన్ని రూ.ఐదు వేలకు పెంచి ప్రత్యేక గౌరవం ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవప్రదమైన వేతనాలు కల్పించి, నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు మన్నె రాజు ముదిరాజ్, ప్రణయ్‌చందర్, అరిగే అశోక్‌కుమార్, సాయన్న, దెబ్బట భాస్కర్, కిరణ్, పాండు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.




