హైదరాబాద్ భారత్ సమ్మిట్, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్‌లో గురువారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న ‘భారత్ సమ్మిట్’పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇది భారత్ సమ్మిట్ కాదని, ‘యాంటీ భారత్ సమ్మిట్’ అని ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే ‘రెజీమ్ చేంజ్’ అజెండాతో పనిచేస్తున్న ‘ప్రోగ్రెసివ్ అలయెన్స్’, జార్జ్ సోరోస్ వంటి శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు. స్పెయిన్, ఫ్రాన్స్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అలజడులు సృష్టించిన వామపక్ష, విదేశీ శక్తులను హైదరాబాద్ వేదికగా భారత్‌లోకి రప్పించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి తిరిగి లాంచ్ చేయడానికే ఈ సదస్సును తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. ఈ సదస్సును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలపై సమ్మిట్ నిర్వాహకుల నుంచి ఇంకా స్పందన రాలేదు.




