రైతాంగం కనీస మద్దతు ధర, NewzFast Telugu (హైదరాబాద్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిఐటియు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్మిక కర్షక మానవహారం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షత వహించగా, సాయిబాబు ప్రారంభించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగిన నల్లగొండలో ఏఐకేఎస్ మహాసభలు జరగడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా రైతాంగం మౌలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం పాలక ప్రభుత్వాల వైఫల్యమేనని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమూలంగా మార్చివేసి వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందని, గ్రామీణ నిరుద్యోగాన్ని పెంచిందని ఆయన ఆరోపించారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల నిర్ణయాల అమలులో తెలంగాణ కార్మికవర్గం రైతాంగ ఉద్యమాలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు డాక్టర్ అరిబండి ప్రసాద్ రావు మాట్లాడుతూ, విదేశీ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసే వరకు రైతాంగం సమరశీల పోరాటాలు సాగించాలని కోరారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కాగితాలకే పరిమితమైందని, ఆచరణలో పెట్టుబడిదారీ వ్యవసాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన విమర్శించారు.
పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, మహాసభల నినాదాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లే లక్ష్యంతో మానవహారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం కోశాధికారి మూడ్ శోభన్ నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పద్మ, సిఐటియు నాయకులు వంగూరు రాములు, ఎస్.
వీరయ్య, ఆర్. సుధా భాస్కర్ పాల్గొన్నారు.




