కరీంనగర్ మహా పాదయాత్ర, NewzFast Telugu (కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గుజ్జ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం లేక విదేశీ శక్తులతో చేతులు కలిపి పనికిమాలిన రాజకీయాలు చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
దేశవ్యాప్తంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్, దిక్కుతోచని స్థితిలో బీజేపీపై చిల్లర రాజకీయాలతో బురదజల్లే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో అశాంతిని రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కుట్రలకు బుద్ధి చెప్పేందుకే ప్రజలు, యువత భాగస్వామ్యంతో కరీంనగర్‌లో ఈ మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, పార్టీ శ్రేణులంతా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ రకరకాల డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పనికిమాలిన రాజకీయాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు తీవ్ర గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.




