మూసీ ప్రక్షాళన, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ నగర భవిష్యత్తుకు కీలకమైన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు.
మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నదిలో తొలివిడతగా 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను అక్కినేని నాగార్జునతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, ప్రకృతి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు.
మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నది తన సంకల్పమని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయమని, కొందరికి బాధ కలగవచ్చని ఆయన పేర్కొన్నారు.
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణలోనూ కొంతమందికి ఇబ్బందులు ఎదురై ఉండొచ్చని, అయితే ఈ నిర్ణయం రాబోయే తరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు.
తమ్మిడికుంట చెరువును గతంలో ఉన్న 14 ఎకరాల విస్తీర్ణం నుంచి 30 ఎకరాలకు పెంచి సుందరంగా తీర్చిదిద్దినట్లు సీఎం తెలిపారు. ఈ అభివృద్ధి కోసం సినీనటుడు అక్కినేని నాగార్జున రెండెకరాల భూమిని అందించి సహకరించారని ప్రశంసించారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే వారిని ప్రభుత్వం గుర్తించి సత్కరిస్తుందని, అందులో భాగంగానే నాగార్జునను ప్రత్యేకంగా గౌరవించినట్లు తెలిపారు.
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో సుమారు 50 శాతం కనుమరుగయ్యాయని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మిడికుంటతో పాటు బతుకమ్మకుంట, బుమ్-రుక్నుద్దౌలా, సున్నం చెరువు, నల్లచెరువు, ఫాక్స్ సాగర్, మియాపూర్ చెరువు సహా సుమారు 20 చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు.
చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వర్షాలు కురిసినప్పుడు నగరం జలమయమవుతోందని అన్నారు.
మూసీ నది కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర సమస్యగా మారిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్లోరైడ్ సమస్య, మూసీ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అర్హులైన బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
1908లో హైదరాబాద్‌లో సంభవించిన భారీ వరదలను సీఎం గుర్తుచేశారు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టిందని, 1920 నాటికి పూర్తయిన ఈ జలాశయాలు నేటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని పేర్కొన్నారు.
సబర్మతీ రివర్‌ఫ్రంట్‌తో పాటు గంగా, యమునా నదుల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రస్తావించారు. మూసీ ప్రాజెక్టు కేవలం సుందరీకరణ కార్యక్రమం కాదని, నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాలను పెంచే కార్యక్రమమని స్పష్టం చేశారు.
ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు.
తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువులో పూడికతీతతో పాటు చుట్టూ 1.6 కిలోమీటర్ల మేర పాత్వే నిర్మించారు.
ఆధునిక ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆటస్థలాన్ని ఏర్పాటు చేశారు. చెరువు అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెలను కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.




