విజయసాయి రెడ్డి, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ. మధ్యలో జనసేన, బీజేపీ.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు పార్టీలు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు ప్రాంతీయంగా, కుల సమీకరణాలతో పుట్టుకొచ్చిన చిన్నాచితకా పార్టీలు మరికొన్ని.
ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలలోకి మరో కొత్త పార్టీ వచ్చి చేరింది. అదే విజయసాయిరెడ్డి ప్రారంభించిన పరివర్తన రాజనీతి పార్టీ.
పేరు కొత్తది. నినాదం కొత్తది.
రాజకీయాలు కూడా కొత్తగా ఉంటాయంటున్నారు సాయిరెడ్డి. కానీ అసలు ప్రశ్న ఒక్కటే.
ఏపీ రాజకీయాల్లో మరో పార్టీకి నిజంగా చోటుందా? లేక ఇప్పటికే ఉన్న రాజకీయ అసంతృప్తులకు మరో వేదిక మాత్రమే తయారైందా?
చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీలు ఎన్నో ప్రయోగాలు చేశాయి. కొన్ని సంచలనాలు సృష్టించాయి.
కొన్ని ఎన్నికల దగ్గరే చతికిలపడ్డాయి. మరి విజయసాయిరెడ్డి ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే కొన్ని ప్రత్యేకమైన బలాలున్నాయి. వైసీపీలో ఒకప్పుడు కీలక నాయకుడిగా ఉన్న ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
ఢిల్లీలో రాజకీయ సంబంధాలు, పార్లమెంటరీ వ్యవహారాలపై అవగాహన, ఆర్థిక, పరిపాలనా అంశాలపై పట్టు ఆయనకు ఉన్నాయి. అంటే ఆయన రాజకీయాలకు కొత్తవాడు కాదు.
అయితే పార్టీని నడపడానికి రాజకీయ పరిచయాలు మాత్రమే సరిపోవు. ప్రజల్లో వ్యక్తిగత ఆదరణ ఉండాలి, కేడర్ ఉండాలి, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసే నాయకత్వం ఉండాలి.
వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు పార్టీ అండ, జగన్ నాయకత్వం, క్యాడర్ ఉండేవి. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్నాక ఆ బలం ఎంతవరకు ఆయన వెంట వస్తుందన్నదే ప్రశ్న.
వైసీపీలో 74 సార్లు అవమానాలకు గురయ్యానని ఆయన చెబుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు.
అయితే ప్రజలకు కావాల్సింది ఎవరు ఎవరిని అవమానించారన్నది కాదు, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, గత పార్టీలకు భిన్నంగా ఏం చూపిస్తారు అనేదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఉంటుందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాలు అత్యంత కీలకంగా ఉన్నాయి.
టీడీపీ, వైసీపీ, జనసేనకు తమదైన సామాజిక పునాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులాలకు అతీతమైన పార్టీని నిర్మించడం సులభం కాదని భావిస్తున్నారు.
రెడ్డి సామాజికవర్గ నాయకులు ఆయన వైపు వస్తారా, జగన్, చంద్రబాబులకు ఉన్న పట్టును ఆయన దాటగలరా అనేది కూడా కీలక ప్రశ్న. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కాపులు వంటి వర్గాలను కలుపుకోవడం లేకపోతే మరో సామాజిక వర్గ రాజకీయ వేదికగా మిగిలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టడం సులభం, కానీ ఎన్నికల్లో నిలబెట్టడం కష్టం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు భారీ అంచనాలున్నా, ఎన్నికల్లో 16.32 శాతం ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు.
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోగా, జనసేనకు ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది.
2024లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలూ గెలుచుకుంది. ఇది ఏపీ రాజకీయాల్లో ఒంటరి పోటీ కంటే కూటమి రాజకీయాలు ఎంత కీలకమో చూపుతోంది.
విజయసాయిరెడ్డి చెబుతున్నట్టు టీడీపీ, వైసీపీలపై ప్రజల్లో అసంతృప్తి ఉండవచ్చు. కానీ అసంతృప్తి ఆటోమేటిక్గా కొత్త పార్టీకి ఓటుగా మారదు.
ఆ అసంతృప్తిని తనవైపు తిప్పుకోవాలంటే ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుంది.
యువతకు 66 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని, 2029 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే 175 స్థానాల్లో పోటీ చేయడం ప్రకటనతో అయిపోదు.
బలమైన అభ్యర్థులు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు, ఎన్నికల ఖర్చులు, ప్రచార వ్యవస్థ, స్థానిక నాయకత్వం అవసరం.
పార్టీలో చేరేది ఎవరన్నదీ కీలకం. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని నాయకులు, పదవులు రాని అసంతృప్తులు, వైసీపీలో ప్రాధాన్యం కోల్పోయిన నాయకులతోనే పార్టీ నిండిపోతే అది కొత్త రాజకీయ పార్టీగా కాకుండా అసంతృప్తులకు పునరావాస కేంద్రంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్తో విభేదించి బయటకు వచ్చిన సాయిరెడ్డిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది కూడా కీలకమే. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, చేసిన పనులకు భిన్నంగా ఇప్పుడు ఏం చెబుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నాయకత్వంపై అసంతృప్తి, కూటముల మార్పులు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమస్యలు కొత్త రాజకీయ అవకాశాలకు దారితీయవచ్చు.
అయితే ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే గ్రామస్థాయి నుంచి బలమైన పార్టీ నిర్మాణం అవసరం.
విజయసాయిరెడ్డి దగ్గర రాజకీయ అనుభవం ఉంది. కానీ ఆయనకు ప్రజాబలం ఎంత, కేడర్ ఎంత, ఎన్నికల విజయాన్ని సాధించే సామర్థ్యం ఎంత అనేది ఇంకా తేలాల్సి ఉంది.
పరివర్తన రాజనీతి పార్టీకి అసలైన పరీక్ష పార్టీ ప్రారంభోత్సవం కాదు, ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.




